Saturday, May 11, 2019

ఎంత వరకూ... ఎందు కొరకూ....1


ఎంత వరకూ... ఎందు కొరకూ....1
ప్రయాణం అన్నది ఒక ఏకాంత వాసం కావాలి. డైలీ లైఫ్ నుండి ప్రక్కకి నెడుతూ, ఉదయాస్తమానాల నడుమ కొత్త గా కుట్టిన లేసు తళుకుల్లాంటి క్షణాల్ని జీవితానికివ్వాలి. అప్పుడే ప్రయాణం అంటే ఆ పదం లోనే ఒక ఆసక్తి, ఎనర్జీ, ఎగ్జైట్మెంట్ కలగలిపిన సముద్రం ఒడ్డున నిలబడి చూసే ఫీల్. ప్రయాణమంటే మనకి మనం ప్రేమించుకోవడానికి ఇచ్చే సుందర అవకాశం. ప్రయాణం అంటే కాలం హఠాత్తుగా కవర్లో పెట్టిచ్చే బ్లాంక్ చెక్. ఇక్కడ ముఖ్య ఉద్దేశ్యం సకుటుంబ సపరివార సమేతం కాకుండా, ఒక ఇండివిడ్యువల్ గా సొంత నిర్ణయంతో ఇష్టంతో నిశ్చయించుకున్న ప్రదేశాన్ని చూసిరావడం అన్నదే ప్రయాణం అన్న పదానికి అర్థం.

కుటుంబం తో జర్నీ అన్నది తప్పేమీ కాదు. అందులో ఒక జెనరల్ సెక్యూరిటీ, ఒక బాధ్యత, ఇంట్లో ఎలాంటి ఆలోచనా ధార నడుస్తుందో, ఈ ప్రయాణం లోనూ దాదాపు అంతే జరుగుతుంది. టిఫిన్స్ పాక్ చేసావా, సూట్ కేసులో బట్టలు అన్నీ సర్దావా, టూత్ బ్రష్ పెట్టావా, టంగ్ క్లీనర్ మర్చిపోయావ్ కదా, ఇంటి తాళాలు ఎక్కడ పెట్టావ్, అన్ని గదులూ లాక్ చేశావా... ఇలా ఏక పక్ష లోక్ సభలాంటి ప్రశ్నలు అయ్యాక, ట్రైనెక్కి కూర్చుని హమ్మయ్యా అనుకునే లోగా, రెండు స్టేషన్లు దాటగానే, ఎవరో ఒకళ్ళకి ఆకలి గుర్తొస్తుంది, లేదా స్నాక్స్ తినాలనిపిస్తుంది. మళ్ళీ బ్యాగ్స్ వెతుక్కొని సర్వింగ్ మొదలు. మాటా మంతీ సాగుతుంది. లెక్కపెట్టుకున్న దూరానికి రైలు చేరాకా అందరూ హోటల్ చేరి చూడాలనుకున్న ప్లేసెస్ కి కార్ మాట్లాడుకొని, గబ గబా చూసేసి, నాలుగు సెల్ఫీలు, పది గ్రూప్ ఫొటోలుగా ట్రిప్ ముగించుకుని ఇంటికి వచ్చేస్తాం. ద టూర్ వాస్ ఆస్సం నా... అఫ్ కోర్స్... కానీ మనలో ఏం జరిగింది? బాహ్యం నుంచి ఇహం నుంచి అహం ఏం మార్పులు చేసుకుంది? అసలు అలాంటి అవకాశం ఇవ్వగలిగే విషయమేనా... 

కొన్ని ప్లేసెస్ మనతో ఏవో గుసగుసలాడతాయి. కొన్ని సమూహాల్లోంచి మాయమవ్వలనిపిస్తుంది. కొన్ని అలవాట్లను చేదించి ఔటాఫ్ బాక్స్ అవ్వలనిపిస్తుంది. అందులోని అభద్రతే మనలను మరింత జాగరూకుల్ని చేస్తుంది. మరింత అందాన్ని ఆస్వాదించేలా అవకాశాల్ని సృష్టిస్తుంది. కొన్ని మార్పులకి చోటివ్వాలంటే కొన్ని అలవాట్లు చేదించాల్సిందే. అలాంటి ఒక మలుపు - ఒంటరి ప్రయాణం. లేదా నాతో భావ సారూప్యమున్న సమూహ ఏకాంతం 

2016 లో మొదటి సారి ఒంటరి గా ప్రయాణం చెయ్యాల్సిందే అని తీర్మానించుకున్న సందర్భం ఒకటి వచ్చింది. Arunachal Pradesh లోని Hamirpur NIITలో పేపర్ PRESENT చెసే అవకాశం వస్తే, నాతో పాటూ పేపర్లు పంపిన మా కొలీగ్స్ అంత దూరం ఎలా వెళ్తాం మేడం? ఇంట్లో విషయాలన్నీ వదిలేసి వెళ్ళడం అంత ఈజీ కాదు కదా... ఇత్యాది ఆలోచనలు వెళ్ళ గక్కాక, ఒక్క దాన్నైనా ఎందుకు వెళ్ళకూడదూ అన్న ఆలోచనే రాజధాని ఎక్స్ప్రెస్స్ ఎక్కించింది. ఆ ప్రయాణం కి టికెట్ అరేంజ్మెంట్స్ అన్నీ పెద్దాడు చూసుకున్నాడు. హైద్రా బాద్ నుండి రాజధాని ఎక్స్ప్రెస్స్ లో ఢిల్లీ వరకూ వెళ్ళడం, అక్కడి నుండి బస్ లో హామిర్పూర్ కి చేరడాం. అక్కడి ప్రొఫెసర్ తో మాట్లాడి రూం అరేంజ్మెంట్ కూడా confirm అయిపోయింది. 


అనుకున్న రోజున మన సికింద్రా బాద్ స్టేషన్ లో రాజధాని ఎక్స్ప్రెస్స్ ఎక్కించి చిన్నాడు జాగ్రత్త మమ్మీ అంటూ చెయ్యూపాడు. నా బెర్త్ చూసుకుని సెటిల్ అయ్యాక, చుట్టూతా ఒక లుక్కేద్దామని వెళితే, ఆల్మోస్ట్ కంపార్ట్మెంట్ అంతా ఖాళీ. బోగీ మొత్తమ్మీద పదిమంది ప్రయాణీకులున్నారు. దారిలో ఎక్కుతారేమోలే అని అనుకుని నా సీట్ కి వచ్చి కూర్చున్నాను. సాయంత్రానికి కూడా జనాభా నుంబర్ లో తేడా లేదు.

ఫుడ్ తీసుకొచ్చిన బాయ్ ని అడిగాను. ఏంటిలా అనీ... వాడు సెలవిచ్చాడు... ఇలా అప్పుడప్పుడు అవుతూనే వుంటుంది. ఇది మామూలే అని అన్నాడు. అప్పటికి రాత్రి డిన్నర్ అయ్యి, వాళ్ళిచ్చిన రగ్ కప్పుకుని పడుకున్నాను. ఆలోచనల స్పీడ్ తప్ప నిద్ర మచ్చుకైనా రాలేదు. పెద్దగా కళ్ళు చేసుకుని, ఏ చప్పుడైనా అటూ ఇటూ చూడటం, టీవీల్లోని నేరాలూ ఘోరాల న్యూస్ ఐటంస్ గుర్తొస్తుంటే, ఇలా కుదరదు అని, ఇయర్ ఫోన్స్ చెవిలోకి దూర్చేసి, మాంచి మ్యూసికల్ హిట్ సాంగ్స్ పెట్టుకుని నిద్ర పోవడానికి ప్రయత్నం చేసా. మోబైల్ లో ఫేస్ బుక్ తిరగెయ్యడం, పిల్లలకి కాల్ చెయ్యడం ఇలా అర్థ రాత్రి దాకా గడిచింది. అప్పటికీ ఆగలేక చిన్నగా కునుకు పట్టేసింది. అయినా మళ్ళీ నా మీద నాకే బాధ్యత ఎక్కువ వుందన్నట్టుగా మధ్యలో మెలకువలూ, సీరియల్ ఎపిసోడ్స్ లా నిద్ర. తెల్లరింది. ఆరింటికల్లా పళ్ళూ తోమి కూర్చుంటే, టీ బ్రేక్ఫాస్ట్ రెడీ.

అదీ అయ్యింది. ఈ లోగా మోబైల్ లో టపా టపా మెసేజ్ ల వర్షం. ఏంటా అని తీసి చూస్తే యువర్ లీవ్ అప్ప్లైడ్ ఇస్ గ్రాంటెడ్ ఆస్ డ్ళోఫ్ అని మూడూ రోజుల లీవ్ కి మూడు రెళ్ళ ఆరు లాసాఫ్ పేస్ అని శుభవార్త.

ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. మైండ్ బ్లాంక్ అయ్యింది. ప్రయాణం మొదలు పెట్టి ఒక రోజు కూడా పూర్తి కాలేదు. డబుల్ లాసాఫ్ పేస్ అంటే ఎవరిని అడగాలి, అసలు ఎందుకు ఇలా జరిగింది, క్లాస్ అడ్జస్ట్మెంత్ సరిగ్గానే చేశాను కదా - రాజధాని ఎక్స్ప్రెస్స్ వేగం తో సమానం గా పరిగెడుతున్నాయి ఆలోచనలు. మా కొలీగ్ కి కాల్ చేసి అడిగితే, నేను కరెక్ట్ గానే లీవ్ ఆక్సెప్ట్ చేశాను మేడం అంటాడాయన. నన్ను నమ్మండి అన్నట్టు. :) పాపం. మరి మిస్టేక్ ఎక్కడ జరిగినట్టు...
(ఇప్పటికి సశేషం)

No comments:

Post a Comment

ఎంతవరకూ, ఎందుకొరకూ...3

ఎంతవరకూ, ఎందుకొరకూ...3   ప్రయాణమంటే మనలో ఇంత ఉత్సాహమెందుకు... ఇంత ఆకాంక్షా ఆసక్తులెందుకు... మనలోని అంతర్గత ఆదిమ నాడులు ఉత్తే...